మీకోసం న్యూస్,ధర్మవరం, ఆగస్టు 19:
ధర్మవరం పట్టణంలోని శివానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో వాటర్ క్యాన్లు మోయించిన ఘటనపై ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న వాటర్ ప్లాంట్ నుంచి పాఠశాల వరకు విద్యార్థులతో వాటర్ క్యాన్లు మోయిస్తున్నారని వారు ఆరోపించారు.
అనంతరం పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్‌యూ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కనుమ దామోదర్ మాట్లాడుతూ.. విద్యార్థులను విద్యాబోధనకు బదులుగా బోధనేతర పనులకు వినియోగించడం వారి విద్యా హక్కులను దెబ్బతీయడమే కాకుండా, వారి భద్రతకు కూడా ప్రమాదకరమని అన్నారు.
ప్రధానోపాధ్యాయుడి విధులపై గతంలో కూడా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆరోపించారు.
విద్యార్థులతో వాటర్ క్యాన్లు మోయించిన ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యుడైన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కులు, భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010
0 కామెంట్‌లు