భారత్‌లో కనిపించని సూర్యగ్రహణం.. ఖగోళ ప్రియుల్లో ఆసక్తి
ఆగస్టు 11 (మీకోసం న్యూస్): ఆకాశ వీక్షకులకు రేపు (ఆగస్టు 12) అరుదైన ఖగోళ ఘటనలు కనువిందు చేయనున్నాయి. ఒకే రోజున ఆరు గ్రహాలు ఉదయానికి ముందు ఆకాశంలో ఒకే ప్రాంతంలో వరుసగా కనిపించనుండగా.. అదే రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన ఖగోళ పరిణామంపై ఖగోళ శాస్త్రవేత్తలు, ఆకాశ వీక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
జీపీ బిర్లా ఆస్ట్రానమీకి చెందిన మృణాళిని తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 12న తెల్లవారుజామున గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించనున్నాయి. ఈ ఘటనను సాధారణంగా ‘సిక్స్ ప్లానెట్ పరేడ్’గా పేర్కొంటున్నారు.
వీటిలో కొన్ని గ్రహాలు కంటికి సులభంగా కనిపించే అవకాశం ఉండగా, దూరంగా ఉండే యురేనస్, నెప్ట్యూన్‌లను చూడటానికి ఆప్టికల్ పరికరాలు అవసరమవుతాయి. ముఖ్యంగా నెప్ట్యూన్‌ను పరిశీలించేందుకు టెలిస్కోప్ అవసరం కాగా, యురేనస్ కోసం బైనాక్యులర్స్ ఉపయోగపడతాయి.
సంపూర్ణ సూర్యగ్రహణం
ఇదే రోజు మరో అరుదైన ఖగోళ ఘటనగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యకు రావడంతో సూర్యుడి కాంతి కొంతకాలం పూర్తిగా ఆవరించబడే ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈసారి సంపూర్ణ గ్రహణ మార్గం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ ప్రాంతం, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొంతభాగం మీదుగా సాగనుంది.
అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. అందువల్ల భారతదేశంలోని ఆకాశ వీక్షకులకు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడే అవకాశం ఉండదు.
సూర్యుడిని నేరుగా చూడొద్దు
సూర్యగ్రహణాన్ని వీక్షించే వారు తగిన సౌర వీక్షణ రక్షణ పరికరాలను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ సన్‌గ్లాసెస్‌తో సూర్యుడిని నేరుగా చూడటం సురక్షితం కాదు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఖగోళ ఘటనలను వీక్షించడం మంచిది.
ఆగస్టు 12న ఆకాశంలో చోటుచేసుకోనున్న ఈ ఖగోళ పరిణామాలు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com

0 కామెంట్‌లు