HOME ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమా బిజినెస్ క్రీడలు జాతీయం అంతర్జాతీయం ఫోటోలు భక్తి వీడియోలు ఆరోగ్యం స్పెషల్ స్టోరీస్

ప్రజల భవిష్యత్‌కు చంద్రబాబు భరోసా


సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు

పుట్టపర్తి నియోజకవర్గ తలరాత మార్చే అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

పుట్టపర్తికి బుల్లెట్ ట్రైన్, ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ, రిలయన్స్ సోలార్ ప్రాజెక్టులు వరం

పుట్టపర్తి, మీకోసం న్యూస్   ఆగస్టు 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడంతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పుట్టపర్తి సాయి నగర్‌లో బుధవారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.

సాయి నగర్ మొదటి వార్డులో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేకు కాలనీ మహిళలు హారతులు ఇచ్చి, పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి సుపరిపాలన అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. వైసీపీ నేతల బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా గతంలో పలు పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, రాష్ట్రానికి సుమారు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

పుట్టపర్తికి భారీ పరిశ్రమలు

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో రూ.2,500 కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పుట్టపర్తిలో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏర్పాటు కానుండటం ఈ ప్రాంత ప్రజలకు గొప్ప వరమని పేర్కొన్నారు.

అదేవిధంగా అమడగూరు మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రిలయన్స్ సంస్థ సహకారంతో సుమారు రూ.51,300 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పుట్టపర్తి ప్రాంతానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పుట్టపర్తి ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రావడం అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు కేటాయిస్తున్నారని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సాయి నగర్ సమస్యలకు పరిష్కారం

సాయి నగర్‌లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్మశానవాటికకు రహదారి సౌకర్యంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు రామారావు, లక్ష్మీపతి, రత్నప్ప చౌదరి, గంగాధర్ నాయుడు, సామకోటి ఆదినారాయణ, బెస్త చలపతి, ఓబులేసు, శ్రీరాములు, వెంకటరాముడు, అంబులెన్స్ రమేష్, ఉమాపతి, సుధాకర్, కృష్ణప్రసాద్, సురేష్ చౌదరి, రాము, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల మహిళా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
✍️ Editor: Prakash | Meekosam.in
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు