ఎస్సీ, ఎస్టీ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌ ఏర్పాటు చేయాలి కలెక్టర్‌కు అర్జీ సమర్పించిన చెరుకూరి గంగులయ్య

భూములు, స్మశానాలు, ఇంటి స్థలాల ఆక్రమణలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

మీకోసం న్యూస్ 

పుట్టపర్తి, ఆగస్టు 10: శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్‌, డీవీఎంసీ సభ్యుడు చెరుకూరి గంగులయ్య కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌ కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌’ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వర్గాలకు సంబంధించిన సమస్యలను ఒకే వేదికపై స్వీకరించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

అంబేద్కర్‌ భవనానికి స్థలం కేటాయించాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహం, అంబేద్కర్‌ భవనం, లైబ్రరీతో పాటు భవిష్యత్తులో నిర్వహించనున్న సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా కనీసం రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, విద్యా అభివృద్ధికి ఇటువంటి వసతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

డీవీఎంసీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌

జిల్లా స్థాయిలో డీవీఎంసీ (డిస్ట్రిక్ట్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ) రివ్యూ సమావేశాన్ని నిర్వహించాలని గంగులయ్య కోరారు. కమిటీ సమావేశాల ద్వారా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, భూ సమస్యలు, ఇతర అంశాలను సమీక్షించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

కాలపరిమితి ముగిసిన డివిజన్‌ స్థాయి డీవీఎంసీ కమిటీలను కూడా వెంటనే పునర్నియమించాలని కోరారు. కమిటీలు క్రియాశీలకంగా పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పౌర హక్కుల దినోత్సవంపై ఫిర్యాదు

ప్రతి నెల చివరిలో నిర్వహించాల్సిన పౌర హక్కుల దినోత్సవం జిల్లాలోని అన్ని మండలాల్లో సమర్థవంతంగా జరగడం లేదని అర్జీలో పేర్కొన్నారు. ఐదు, ఆరు మండలాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని, కొన్ని చోట్ల సంబంధిత అధికారులు కూడా హాజరు కావడం లేదని ఆరోపించారు.

పౌర హక్కుల దినోత్సవాన్ని కేవలం తూతూమంత్రంగా నిర్వహించకుండా, ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు హాజరై సమీక్షించాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీల భూముల పరిరక్షణకు చర్యలు

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు అన్యాక్రాంతమైనట్లు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని కూడా కలెక్టర్‌కు వివరించినట్లు తెలిపారు. అలాగే ఆయా వర్గాలకు సంబంధించిన స్మశానవాటికలు, ఇంటి స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు.

ఈ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు వారి హక్కులు, భూములు, స్థలాలు పరిరక్షించేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డీవీఎంసీ సభ్యులు, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్‌ చెరుకూరి గంగులయ్య, హెచ్‌ఆర్‌సీసీఐ జిల్లా జనరల్‌ సెక్రటరీ కోటకొండ కృష్ణప్ప, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ డివిజన్‌ హెచ్‌ఆర్‌సీసీఐ చైర్మన్‌ ఎం.ఎన్‌. మూర్తి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎల్‌. అంజలి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు