సోమందేపల్లి: ప్రపంచ తల్లిపాలు దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి సీడీపీఓ కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీడీపీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాగర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, ఎంపీడీవో వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పుట్టిన ప్రతి శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల సంపూర్ణ పోషకాహారం అందడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, ప్రతి తల్లి వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి పిల్లలకు తప్పనిసరిగా అందించాలని సూచించారు.
సీడీపీఓ మాట్లాడుతూ, తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకాలను ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్లు, రెండు మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తల్లిపాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
0 కామెంట్‌లు