HOME ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమా బిజినెస్ క్రీడలు జాతీయం అంతర్జాతీయం ఫోటోలు భక్తి వీడియోలు ఆరోగ్యం స్పెషల్ స్టోరీస్

సూక్ష్మ, చిన్న పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం

జిల్లాలో ఎంఎస్ఎంఈల స్థాపనకు విస్తృత అవకాశాలు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపు

మీకోసం న్యూస్, హిందూపురం,సెప్టెంబర్ 30: సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విజయవంతమైన నిర్వహణకు సరైన ఉత్పత్తి ఎంపిక, ఆధునిక సాంకేతికత, ప్రాజెక్టు ఫైనాన్సింగ్, డిజిటైజేషన్, ఈ-కామర్స్–డిజిటల్ మార్కెటింగ్ వంటి ఐదు అంశాలు అత్యంత కీలకమని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని సాయి తేజ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ శాఖల ఆధ్వర్యంలో ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, పరిశ్రమల ప్రతినిధులు విశేషంగా హాజరయ్యారు.

సరైన ఉత్పత్తి ఎంపికతో విజయానికి బాట

వ్యాపారం ప్రారంభించే ముందు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులు, ముడి సరుకులు, మార్కెట్ డిమాండ్, భవిష్యత్తులో ఏర్పడే పారిశ్రామిక అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని సరైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవడం పరిశ్రమ విజయానికి మొదటి అడుగు అని తెలిపారు.

స్థానికంగా లభించే ముడి సరుకులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తి నాణ్యతతో పాటు ఒక్కో ఉత్పత్తిపై లభించే మార్జిన్‌పై కూడా పారిశ్రామికవేత్తలు దృష్టి పెట్టాలని సూచించారు.

ఆధునిక సాంకేతికత వినియోగించాలి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను పరిశ్రమల్లో విస్తృతంగా వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. యంత్రాలు, ఉత్పత్తి విధానాల్లో సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని వివరించారు.

చిన్న పరిశ్రమల యజమానులు తమ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ కొనుగోళ్లు, అమ్మకాలు, ఖర్చులు, అకౌంటింగ్, స్టాక్, ఉత్పత్తి నిర్వహణ వంటి అంశాలను డిజిటల్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. యజమాని పరిశ్రమ వద్ద లేకపోయినా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం మొబైల్ ద్వారా తెలుసుకునే విధంగా డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

అవసరానికి మించి రుణాలు వద్దు

పరిశ్రమను ప్రారంభించే సమయంలో అవసరానికి మించి రుణాలు తీసుకోకూడదని కలెక్టర్ సూచించారు. రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, మారటోరియం కాలం, నెలవారీ చెల్లింపులు, భవిష్యత్తులో వచ్చే ఆదాయం, నగదు ప్రవాహం వంటి అంశాలను పరిశీలించాలని తెలిపారు.

ప్రాజెక్టుకు అవసరమైన మేరకే రుణం తీసుకుని, ఆదాయం–ఖర్చులను సమతుల్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని తెలిపారు.

డిజిటల్ మార్కెటింగ్‌తో విస్తృత మార్కెట్

ప్రస్తుత కాలంలో ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, ఈ-కామర్స్ వేదికలను వినియోగించుకుని స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయ స్థాయి మార్కెట్లకు తీసుకెళ్లాలని సూచించారు.

ఆన్‌లైన్ విక్రయాల ద్వారా భౌగోళిక పరిమితులను అధిగమించి విస్తృత మార్కెట్‌ను చేరుకోవచ్చని, అదే సమయంలో వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

డ్వాక్రా, మెప్మా మహిళలు కేవలం రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా తమలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వ్యాపారాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

పొదుపు సంఘాల నిర్వహణ, రుణాల చెల్లింపులో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలో టాప్-5లో నిలవడం, హిందూపురం మహిళలు ప్రథమ స్థానంలో ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. క్రమశిక్షణతో రుణాలను 100 శాతం చెల్లిస్తున్న మహిళల ఆర్థిక క్రమశిక్షణను ఆయన ప్రశంసించారు.

చింతపండుతో విలువ ఆధారిత ఉత్పత్తులు

జిల్లాలో సమృద్ధిగా లభించే చింతపండును కేవలం ముడి సరుకుగా విక్రయించకుండా పల్ప్ రూపంలో తయారు చేసి మార్కెట్ చేయవచ్చని కలెక్టర్ ఉదాహరణగా వివరించారు. ఆధునిక యంత్రాలు, నాణ్యమైన ప్యాకింగ్, అవసరమైన చట్టపరమైన అనుమతులు, బ్రాండింగ్‌తో చింతపండు పల్ప్‌ను మార్కెట్‌లోకి తీసుకెళితే మంచి డిమాండ్ పొందే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా స్వీట్లు, కేకులు, దుస్తుల తయారీ, చోలే మసాలా పొడులు, పిండి మిల్లులు తదితర స్వయం ఉపాధి కార్యకలాపాలను వ్యాపారాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

స్థానిక వ్యాపారం.. మహానగరాలకు మార్కెట్

మహిళలు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయిస్తూ బెంగళూరు వంటి మహానగరాల్లో కూడా మార్కెట్‌ను విస్తరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. తమకు తెలిసిన నైపుణ్యాలను కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, సంగీతం నేర్పించడం, ఇతర నైపుణ్యాలను శిక్షణగా అందించడం వంటి కార్యకలాపాలను కూడా డిజిటల్ వ్యాపారాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు.

మహిళలందరూ సమూహాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని, పరస్పర సహకారంతో వ్యాపారాలను విస్తరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ధైర్యంగా ముందడుగు వేస్తే వందల కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి మహిళా పారిశ్రామికవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ శాఖల సహకారం

జిల్లాలో రాబోయే రోజుల్లో ఏర్పడనున్న పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని కొత్త అవకాశాలను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు, సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు, అవసరమైన హ్యాండ్‌హోల్డింగ్ ద్వారా ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.

వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ డెస్క్‌లు, బ్యాంకుల స్టాల్స్, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కేంద్రాల ద్వారా ఔత్సాహికులకు అవసరమైన సమాచారాన్ని అందించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, సబ్సిడీలపై అధికారులు అవగాహన కల్పించారు.

బ్యాంకింగ్ రంగ నిపుణులు ప్రాజెక్టు నివేదికల తయారీ, రుణాల మంజూరు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు విధానాలపై వివరించారు. పారిశ్రామికవేత్తలు తమ సందేహాలను సంబంధిత శాఖల అధికారులు, నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యుల సమన్వయకర్త వీరయ్య, హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహశీల్దార్ వెంకటేశు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జె. నాగరాజు, ఏపీఐఐసీ డీజెడ్‌ఎం దేవకాంతమ్మ, ఎల్‌డీఎం ఫనీంద్ర కుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, మెప్మా పీడీ నాగరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, జేఆర్ సిల్క్స్ అధినేత జింకా రామాంజనేయులు, వేణు మోటార్స్ అధినేత వేణు, గాయత్రి మసాలా పౌడర్స్ భాగస్వామి గౌతమ్ బుశెట్టి, ఇండియా ఎస్ఎంఈ ఫోరం ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పాల్గొన్నారు.
✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు