ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలి: సిపిఎం నాయకులు అంకె ముత్యాలు
మీకోసం న్యూస్ ,కొత్తచెరువు, సెప్టెంబర్ 20:
రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు పట్టణంలోని పెనుగొండ రోడ్డులో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండటం వల్ల ప్రజల భద్రతకు ముప్పు ఉందని సిపిఎం నాయకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నాయకులు పెనుగొండ రోడ్డును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా సిపిఎం కొత్తచెరువు మండల కార్యదర్శి అంకె ముత్యాలు మాట్లాడుతూ, ....
వర్షం వచ్చిన ప్రతిసారీ పెనుగొండ రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడంతో పాటు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పరిశీలించి సరిచేయాలని, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు మరియు స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, లక్ష్మన్న, శీన, భాష, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్లు