రైలులో ఆరు చిన్న గంజాయి ప్యాకెట్లతో వ్యక్తి పట్టివేత

మీకోసం న్యూస్,పెనుకొండ, సెప్టెంబర్‌ 11: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో పెనుకొండ రైల్వే స్టేషన్‌లో ఈగల్‌ బృందం, పోలీసులు కలిసి రైలులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద ఆరు చిన్న ప్యాకెట్ల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని తదుపరి చర్యల కోసం జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు.

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, ఈగల్‌ ఐజీ ఏకే రవికృష్ణ ఐపీఎస్‌ సూచనలతో, జిల్లా ఎస్పీ ఎస్‌. సతీష్‌ కుమార్‌ ఐపీఎస్‌ పర్యవేక్షణలో జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగానే శుక్రవారం పెనుకొండ, హిందూపురం రైల్వే స్టేషన్లలో ‘ఈగల్‌ ఆన్‌ ట్రైన్‌’ కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం అడిషనల్‌ ఎస్పీ కేవీ మహేష్‌ ఆధ్వర్యంలో ఈగల్‌ బృందంతో పాటు ఆర్పీఎఫ్‌, ఏఆర్‌ పోలీస్‌ సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌, సబ్‌ డివిజన్‌ పోలీస్‌ సిబ్బంది కలిసి రైలులోకి వెళ్లి వివిధ బోగీల్లో సుమారు అరగంట పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

రైలులో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే వారిని గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో కూడా బోగీల్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ వ్యక్తి వద్ద ఆరు చిన్న ప్యాకెట్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, వ్యక్తిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై జీఆర్‌పీ పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.

రైళ్లలో ప్రత్యేక నిఘా

ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ కేవీ మహేష్‌ మాట్లాడుతూ.. రైళ్ల ద్వారా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందన్నారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఈగల్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌, పోలీస్‌ సిబ్బందితో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రైళ్లలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై, మాదకద్రవ్యాలను తరలించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతున్నామని చెప్పారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడటం, సమాజాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చడం కోసం పోలీస్‌ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అడిషనల్‌ ఎస్పీ కేవీ మహేష్‌ స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో ఏఎస్పీతో పాటు సీఐలు, అబ్దుల్‌ కరీం, ఈగల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.