మీకోసం NEWS తేదీ లోడ్ అవుతోంది…|సమయం --:--
హోమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జాతీయం భక్తి సినిమా
తాజా వార్తలు
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

⚖️ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి!

గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ చైతన్యం తీసుకురావాలి – అదనపు జిల్లా జడ్జి వి. వెంకటేశ్వరరావు

హిందూపురం, పెనుకొండలో ఘనంగా న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవ వేడుకలు

హిందూపురం / పెనుకొండ, నవంబర్ 9 (మీకోసం న్యూస్):

మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి అంశం చట్టంతో ముడిపడి ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని అదనపు జిల్లా జడ్జి వి. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

సోమవారం స్థానిక అదనపు జిల్లా కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు చిన్నచిన్న సమస్యల కోసం న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

⚖️ అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం

న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం వంటి విధానాల ద్వారా ఇరు వర్గాలతో చర్చించి, సామరస్యపూర్వకంగా వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.

ఈ విధానాల వల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, న్యాయవాదులకు కూడా ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రజలకు, ముఖ్యంగా కక్షిదారులకు న్యాయవాదులు సరైన అవగాహన కల్పించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ చైతన్యం పెంచాలి

సామాజిక సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలను కూడా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చట్టాలు, న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ దిశగా పారా లీగల్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తరచూ సమావేశాలు నిర్వహించి, ప్రజలకు చట్టాలు, న్యాయ సంబంధిత అంశాలపై వివరించి చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

పారా లీగల్ వాలంటీర్లకు న్యాయవాదుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ఇప్పటికే లోక్ అదాలత్‌ల ద్వారా అనేక సామాజిక సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇలాంటి కార్యక్రమాలపై న్యాయవాదులు మరింత దృష్టి సారించాలని కోరారు.

పెనుకొండలోనూ ఘనంగా వేడుకలు

అదేవిధంగా పెనుకొండ కోర్టు ఆవరణలో కూడా మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవాన్ని న్యాయమూర్తులు బుజ్జప్ప, రాకేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనంత గోపాలకృష్ణ, ఏజీపీ రామచంద్రప్ప, న్యాయవాదులు రాజశేఖర్, సిద్దు, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు రెడ్డి, లోక్ అదాలత్ పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్వీలు), కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు న్యాయంపై అవగాహన కల్పించడం, అర్హులకు న్యాయ సహాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలపై చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు