మీకోసం NEWS తేదీ లోడ్ అవుతోంది…|సమయం --:--
హోమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జాతీయం భక్తి సినిమా
తాజా వార్తలు
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పెళ్లికి ముందు యువతీ యువకులు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలి!

స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలి

జిల్లాలో రక్తం కొరత లేకుండా బ్లడ్ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశం

పుట్టపర్తి,మీకోసం న్యూస్ ,నవంబర్ 13:

వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. హెచ్‌ఐవీ నివారణ, నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, రక్తనిధి కేంద్రాల పనితీరుపై సమీక్షించారు.

పెళ్లికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలపై అవగాహన

వివాహానికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై యువతలో అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆకర్షణీయమైన గోడపత్రికలు రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని, వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల (NGOs) సహకారంతో పరీక్షలను ముమ్మరం చేయాలని సూచించారు.

గుర్తించిన ప్రతి బాధితుడికి మెరుగైన చికిత్స

ఇప్పటివరకు గుర్తించని హెచ్‌ఐవీ బాధితులను పరీక్షల ద్వారా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ వెంటనే యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సుఖవ్యాధుల చికిత్సా కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచాలని, చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ప్రోటోకాల్స్ ప్రకారం హెచ్‌ఐవీ పరీక్షలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉండాలి

జిల్లాలోని అన్ని రక్తనిధి కేంద్రాలు (బ్లడ్ బ్యాంకులు) అవసరమైన మేరకు రక్త నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఎక్కడా రక్తం కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు. ఇందుకోసం ప్రతి బ్లడ్ బ్యాంకు తరచుగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలి

హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఐసీడీఎస్, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

కార్మికులు, అవసరమైన ఇతర వర్గాలకు హెచ్‌ఐవీ పరీక్షలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలపై ప్రజెంటేషన్

అంతకుముందు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి (DLO) డాక్టర్ అనుపమ జేమ్స్ జిల్లాలో అమలవుతున్న హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ ప్రణయ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వెంకటరత్నం, సూపర్‌వైజర్ జీ.వి. రమణ, హిందూపురం బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, బత్తలపల్లి ఏఆర్టీ కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హిమచంద్ర పాల్గొన్నారు.

వీరితో పాటు సిబ్బంది ఈ.వి. రమణ, నారాయణ స్వామి, డీఆర్‌పీ రమేష్, ఫోర్డ్, చైతన్య, జనజాగృతి, దిశ, శక్తి మైత్రి మహిళా సంఘం ప్రివెన్షన్ యూనిట్ల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

మీకోసం NEWS మీ మాట | మా వార్త | మీ కోసం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు