Time Management-కాలజ్ఞత

KV Health Tips
0

 

కాలజ్ఞత, time management

        

అందరికీ 'ఫ్రీ'గా దొరికే అమూల్య పరికరం..“టైం సరిపోవడం లేదు!"  అని ఒకరి గోడు.


"టైం పాస్ కావడం లేదు" అని ఇంకొకరి విసుగు.


"టైం కలిసి రావడం లేదు" మరొకరి దిగులు.

.... ఇలా కాలం గురించి, అనేక ఫిర్యాదులు, వ్యాఖ్యలు చేస్తుంటాం. కానీ కాలం ఏంచేస్తుంది?


అది మహా సంపదలా ఉంది. దాని విలువ తెలుసుకోవడం, తెలుసుకోలేక పోవడం వల్లనే సద్వినియోగం, దుర్వినియోగం వంటివి జరుగుతుంటాయి.


'గడచిన కాలం తిరిగిరాదు' అని అందరికీ తెలిసిన విషయమే. అయినా - సద్వినియోగం ద్వారా కాలాన్ని మనం సంపాదించుకున్నట్లే.

కాలాన్ని వినియోగించుకోవడంలోనే విజయానికి కీలకం ఉంది.


శ్రీరాముడు భరతుని పాలనా వ్యవహారాల గురించి ప్రశ్నిస్తూ… "సకాలంలో సరియైన నిర్ణయాలను తీసుకుంటున్నావా? సూర్యోదయానికి మునుపే నిద్రలేస్తున్నావా? తెల్లవారుఝామున ముఖ్యాలోచనలు చేస్తున్నావా?" వంటి ముఖ్యాంశాలను ప్రస్తావించాడు.


శ్రీరాముని దివ్యగుణాలలో 'కాలజ్ఞత' ఒకటిగా వాల్మీకి అభివర్ణించాడు.


"నిదురచే కొన్నాళ్ళు - నేరముల కొన్నాళ్ళు, ముదిమిచే కొన్నాళ్ళు మోసపోతి కదిసి కోరినను గతకాలమ్ము వచ్చునే..." అని అన్నమయ్య మాట.


భగవంతుడిచ్చిన జీవితకాలం నిద్ర, సోమరితనం వంటి తమోగుణ కార్యాలతోనో, స్వార్థపూరితమైన నేరాలతోనో, ఏమీ చేయలేని ముసలితనం, రోగం వంటి అసమర్థతలతోనో వ్యర్ధ పరచుకుంటే - మళ్ళీ పోయిన కాలాన్ని తెచ్చుకోగలమా! - అని ప్రబోధగీతికను పలికాడా పదకవితా పితామహుడు.


“ఆయురవ్యయంబు చేయందగదు" అని ప్రహ్లాదుని హెచ్చరికను పోతనగారు పలికారు.


"కాలాన్ని సంపాదించే ప్రక్రియలు":


'వేకువనే నిద్రలేవడం!' 

ఇది కాలనిర్వహణ(టైం మేనేజ్మెంట్)లో అత్యంత ప్రధానమైనది. మన సంస్కృతిలో దీనికి ధార్మిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా చూపించారు. వీటితో పాటు భౌతిక జీవన సౌభాగ్యానికి ఇది పునాది.


యోగ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం కూడా ఈ తెల్లవారుఝామున లేచే ఆరోగ్యకరమైన అలవాటును అభినందించాయి.

ఆ సమయంలో ఉన్న ప్రశాంతత రోజులో ఇంక ఏ భాగంలోనూ చూడలేం.


ఉషఃకాలాన్ని 'రోగహరణకాలం'గా పేర్కొంది వేద విజ్ఞానం. బుద్ధి, శక్తిని జాగృతం చేసే ప్రభావం ఈ కాలంలో ఉంది కనుకనే దీనికి 'బ్రాహ్మీముహూర్తం' అని పేరు పెట్టారు.


ఈ సమయంలో ధ్యానం, అధ్యయనం, ప్రశాంత మనస్సుతో ఆలోచించడం... వంటివి తగిన కర్మలు. ఇవి మన బుద్ధిని నియంత్రించగలిగే సాధనాలు. ఒక సంయమనం(Balance), చిత్తస్థైర్యం, శాంతి, సరియైన నిర్ణయాన్ని తీసుకోగలగడం - వంటివి ఈ సాధనాల ప్రయోజనాలు.


కాలవిభజన మరొక ముఖ్యాంశం;-*జీవితం ఎన్నో ప్రాధాన్యాలతో (Priorities)కూడి ఉంటుంది. ఒక దశలో ఒకటి ప్రధానం అనిపించవచ్చు. కానీ, జీవితంలో ఎన్నో ముఖ్యాంశాలు ఉంటాయి. వాటన్నిటికీ న్యాయం చేయగలిగినప్పుడు విజయవంతమైన జీవితాన్ని సాధించవచ్చు.


ఒక దశలో విద్య, మరొకదశలో వృత్తి, సంపాదన... ప్రధానాంశాలు కావచ్చు. కానీ అవే ప్రధానమని మిగిలినవి విస్మరిస్తే భావిజీవితంలో వెలితి వివిధ విధాలుగా బాధించవచ్చు. ప్రధానాంశాలను ఆయా దశలలో సాధిస్తూనే మిగిలిన వాటికి ప్రాధాన్యమివ్వాలి.


కొందరు సంపాదన, వృత్తి ఒక వ్యసనంలా పెట్టుకొని సకాల భోజనాన్నీ, నిద్రనీ, విశ్రాంతినీ నిర్లక్ష్యపరుస్తారు. మంచి వయసులో శరీరం తట్టుకొని సహకరించనూవచ్చు. కానీ వయసు గడిచే కొద్దీ - ఆహారనిద్రాదుల నిర్లక్ష్య ప్రభావం వివిధ వ్యాధుల రూపంలో పొడసూపుతుంది. సంపాదించిన కోట్లు కూడా ఆరోగ్యస్థితికి సహకరించలేక పోవచ్చు.


ఒక క్రమబద్ధమైన జీవితాన్ని బాల్యం నుండి అలవాటు చేయించాలి.


మితిమీరిన వినోదాలు కాలాన్ని సద్వినియోగం చేయనివ్వవు -


వినోదం మనకు ఒత్తిడి నుండి ఒక ఉపశమనాన్ని, ఉత్తేజాన్నీ ఇచ్చేమాట వాస్తవమే. కానీ కాలంలో ఎక్కువ భాగం దానికే కేటాయించినా ఆలోచనాశక్తి, చైతన్యం క్షీణించే ప్రమాదం ఉంది.


వినోదంతో పాటు విజ్ఞానాన్ని మేళవించుకుంటే 'కాలక్షేపం సత్కాల వినియోగం'గా ఉపకరిస్తుంది.


కుటుంబం, సమాజం - ఈ రెండింటి పట్ల వ్యక్తికి బాధ్యత ఉంటుంది -


కాలాన్ని వ్యననాలకో, వృత్తి వ్యాపారాలకో అంకితం చేసి కుటుంబ సంబంధాలను అలక్ష్యం చేస్తున్నవారూ ఉంటారు. ఇది జీవితంలో పెద్ద అగాధాన్ని సృష్టించే ప్రమాదం లేకపోలేదు.


కుటుంబం ఒక ముఖ్య వ్యవస్థ. దానిని కాపాడుకోవడం, బలపరచడం వ్యక్తి బాధ్యత. తగిన అనుబంధాన్ని, జాగ్రత్తను బాధ్యతా నిర్వహణనీ కుటుంబపరంగా చూపించడం కూడా కాలంలో ముఖ్యభాగమే.


‘కాలం' అనేది ప్రతి వ్యక్తికీ ఉచితంగా లభించే పరికరం. దాని విలువ తెలిసి సద్వినియోగం చేసుకునే వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. విలువ తెలియని వాళ్ళూ, దుర్వినియోగ పర్చేవాళ్ళూ వృద్ధాప్యంలో దుఃఖిస్తూ కూర్చుంటారు. 



Post a Comment

0Comments
Post a Comment (0)