- మీకోసం న్యూస్ జూలై 06 : సోమందేపల్లి
మానసిక అస్వస్థతతో తిరుగుతున్న మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత
సోమందేపల్లి: మానసిక అస్వస్థతతో సోమందేపల్లి పట్టణంలో తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న మహిళను పోలీసులు గుర్తించి, వైద్య చికిత్స అందించి అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.
స్థానికుల సమాచారం మేరకు స్పందించిన సోమందేపల్లి పోలీసులు మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఉమెన్ ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించారు. ఇదే సమయంలో ఆమె వివరాల కోసం విచారణ చేపట్టారు.
దర్యాప్తులో ఆమె లక్ష్మీదేవి (40) గా గుర్తించారు. చిలమత్తూరు మండలం కొత్తచామలపల్లి గ్రామానికి చెందిన ఆమెకు భర్త వేమన్నగారి నరసింహప్పతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులను సంప్రదించగా, ఆమెకు మానసిక ఆరోగ్య సమస్య ఉండటంతో అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోతుంటారని తెలిపారు.
అన్ని వివరాలు నిర్ధారించిన అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కుటుంబ సభ్యురాలిని సురక్షితంగా చేర్చిన సోమందేపల్లి పోలీసులకు ఆమె కుమార్తె గాయత్రి సహా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మానసిక అస్వస్థతతో లేదా దిక్కుతోచని స్థితిలో ఎవరైనా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

0 కామెంట్‌లు