మీకోసం న్యూస్, సోమందేపల్లి ఆగస్ట్ 25: పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రం శిరిడీ నగర్‌కు చెందిన వేణు నిజమైన చేనేత కార్మికుడిగా మగ్గాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. నెలకు కేవలం రూ.4 వేల అద్దె చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే నేతన్న సేవా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందుతుందని ఆశించిన వేణు.. తనకు కూడా పథకం వర్తిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో పలుమార్లు సంబంధిత కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధులు, నాయకుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరా నేతన్న సేవా పథకం అర్హుల జాబితాను పరిశీలించగా, తన పేరు కనీసం అర్హుల జాబితాలో కూడా లేకపోవడంతో వేణు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాను నిజమైన చేనేత కార్మికుడినని, మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదో అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నారు.
అర్హులైన నిజమైన చేనేత కార్మికులను పక్కనపెట్టి, అనర్హులకు పథకం వర్తించేలా జాబితా రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా హ్యాండ్లూమ్స్ అధికారులు అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా జాబితా తయారు చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు ఉద్దేశం అర్హులైన పేదలకు, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడమే. అలాంటప్పుడు మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నిజమైన చేనేత కార్మికుడికి పథకం అందకపోవడం ఎంతవరకు న్యాయమని వేణు ప్రశ్నిస్తున్నారు.
తన పరిస్థితిని అధికారులు మరోసారి పరిశీలించి, అర్హత ఉన్నట్లయితే నేతన్న సేవా పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని వేణు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నేతన్న సేవా పథకం లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టి, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010
0 కామెంట్‌లు