మీకోసం న్యూస్ | హిందూపురం ఆగస్ట్ 21:
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల కేంద్రంలోని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత, గిరిజన, బహుజన సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది పాల్గొని బహుజనుల ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హిందూపురం ప్రెస్‌క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివరామకృష్ణ మాట్లాడారు.
తనకు జరిగిన అన్యాయం తీవ్రమైనదని, అయితే సీఐ రాజగోపాల్ నాయుడును వీఆర్‌కు పంపించడం కేవలం కంటితుడుపు చర్యగానే భావిస్తున్నామని శివరామకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు మరింత సమగ్రంగా ఆలోచించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటమే ప్రజా సంఘాల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు, చట్టాలను ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థలు సమర్థవంతంగా అమలు చేసినప్పుడు ప్రజలకు అనేక సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ అధికారులు బాధ్యతతో పరిష్కరించాలని శివరామకృష్ణ కోరారు. ప్రజలకు న్యాయం అందేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
తనకు బాసటగా నిలిచి సంఘీభావం తెలిపిన దళిత, గిరిజన, బహుజన సంఘాల ప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బహుజన చైతన్య వేదిక అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి మద్దతు తెలిపిన న్యాయవాదులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
0 కామెంట్‌లు