ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ.. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వమిది
ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
రెండేళ్లలో రూ.1,296 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
మీకోసం న్యూస్,అనంతపురం ఆగస్ట్ 21: వైసీపీ ప్రభుత్వంలా బటన్లు నొక్కి ప్రజలను మభ్యపెట్టకుండా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 55వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపేందుకు అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 55 ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మొత్తం 1,243 అర్జీలు అందగా, వాటిలో 1,204 సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. మరో 39 అర్జీలు రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
గత ప్రభుత్వం సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లినా, వాటిని భరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తోందని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భర్తీ చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డీఎస్సీ విషయంలో వైసీపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు వాటిని నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ చేసినా, వైసీపీ నాయకులు ముందుకు రావడం లేదన్నారు.
రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు రూ.40 వేల కోట్లు కేటాయించడంతో పాటు, పీపీపీ విధానంలో మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. అనంతపురం జిల్లాకు ఇప్పటికే సుమారు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు.
ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన పరిశ్రమ పుట్టపర్తికి రావడం అనంతపురం జిల్లాకు గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత రెండేళ్లలో రూ.1,296 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఇందులో సుమారు రూ.300 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు రోడ్ల పనులను కూడా పూర్తి చేశామని ఎమ్మెల్యే వివరించారు.
ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
0 కామెంట్‌లు