గుడిపల్లిలో నేతన్న సేవ పథకంపై చేనేత కార్మికుడి ఆవేదన

మీకోసం న్యూస్,సోమందేపల్లి, ఆగస్టు 15: మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కొత్తూరు సురేష్‌కు నేతన్న సేవ పథకం ప్రయోజనం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మగ్గం నేసే వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నప్పటికీ పథకం కింద ఆర్థిక సాయం అందలేదని ఆయన తెలిపారు.

సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను చేనేత వృత్తిలోనే కొనసాగుతూ జీవనం సాగిస్తున్నానని, పథకానికి సంబంధించిన అవసరమైన పత్రాలను గ్రామ సచివాలయంలో రెండుసార్లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తన ఖాతాలో నగదు జమ కాలేదని పేర్కొన్నారు. తన అర్హతను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం తనకు పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అర్హులందరికీ సమానంగా అందించాలి

చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నిజమైన నేతన్నలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు పారదర్శకంగా పరిశీలన చేయాలని సురేష్ కోరారు. పథకం కింద ఇప్పటికే ఎందరికో ప్రయోజనం అందించామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, అర్హత ఉన్నప్పటికీ తనకు ఎందుకు ప్రయోజనం అందలేదో స్పష్టత ఇవ్వాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న అన్ని పథకాల ప్రయోజనాలు అందేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి నేతన్నకు సమానంగా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నిజంగా మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనలాంటి చేనేత కార్మికుల అర్హతను మరోసారి పరిశీలించి, పథకం ప్రయోజనం అందించాలని కొత్తూరు సురేష్ కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు