ఒక ఆలువ, స్కూటర్ స్వాధీనం.. నిందితులకు రిమాండ్
అక్రమ వేటకు పాల్పడితే కఠిన చర్యలు: ఎఫ్‌ఆర్‌ఓ డి. గుర్రప్ప
కదిరి, ఆగస్టు 10 (మీకోసం న్యూస్): వన్యప్రాణుల వేటను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఈస్ట్ బీట్ పరిధిలోని దొరిగల్లు రిజర్వ్ ఫారెస్ట్‌లో వన్యప్రాణిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ, బుల్లెట్లు, గన్‌పౌడర్, ఒక ఆలువ, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అటవీశాఖ అధికారుల వివరాల మేరకు.. దొరిగల్లు రిజర్వ్ అడవిలోని పసంబావి ప్రాంతంలో వన్యప్రాణుల వేట జరుగుతోందన్న సమాచారం అటవీశాఖ సిబ్బందికి అందింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. వేటకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అరెస్టయిన వారిని నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుళ్లాయప్ప, ఉమామహేష్, గంగన్న యాదవ్, బత్తలపల్లికి చెందిన ముత్యాలయ్య, ఆంజనేయులుగా అధికారులు గుర్తించారు.
ఆయుధాలు, సామగ్రి స్వాధీనం
అరెస్టు చేసిన వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, బుల్లెట్లు, గన్‌పౌడర్, ఒక ఆలువ, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న
సామగ్రిని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను కదిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
వేటగాళ్లకు హెచ్చరిక
వన్యప్రాణులను వేటాడినా, అడవుల్లో అక్రమంగా ఆయుధాలతో సంచరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డి. గుర్రప్ప హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందన్నారు.
అక్రమ వేటకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణకు నిరంతరం గస్తీ, నిఘా కొనసాగుతుందని తెలిపారు. అడవుల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్రహ్మయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ప్రదీప్ తేజ, హరిప్రసాద్, భాస్కర్, అనిల్, రాజేశ్వరి, రేణుక, శ్రీరాములు తదితర అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

0 కామెంట్‌లు