ఒడిసిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మీకోసం న్యూస్,  ఓడిచెరువు, ఆగస్టు 15: జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి అన్నారు. ఓడిచెరువు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మండలంలోని రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్, సొసైటీ, గ్రామపంచాయతీ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్, ప్రభుత్వాసుపత్రి, పశువైద్యశాల, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇనగలూరు టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అధికారులు, నాయకులు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

ఈ సందర్భంగా పలువురు అధికారులు, నాయకులు మాట్లాడుతూ నేడు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన ప్రాణత్యాగాలు, అలుపెరుగని పోరాటాల ఫలితమేనన్నారు. ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో పురవీధుల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కొండకమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ మండల కార్యదర్శి కొండబోయిన సతీష్ రూ.20 వేల విలువైన బహుమతులను అందించడంతో పాటు 100 అడుగుల జాతీయ జెండాను పాఠశాలకు బహూకరించారు.

పలుచోట్ల జెండా ఆవిష్కరణ

మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుమ్మల పర్వీన్, శామీర్ భాష, ఎంపీడీవో శివరాం ప్రసాద్ రెడ్డి, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి, ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ భాను ప్రకాష్, పశువైద్యశాలలో డాక్టర్ ప్రవీణ్ కుమార్, సొసైటీ అధ్యక్షుడు తుమ్మల మహబూబ్ బాషా, ఇనగలూరు టోల్ ప్లాజాలో మేనేజర్ ప్రకాష్ జాతీయ జెండాలను ఎగురవేశారు.

వశిష్ట పాఠశాల చైర్మన్ పిట్ట శివశంకర్ రెడ్డి, శ్రీ విజ్ఞాన్ పాఠశాల చైర్మన్ మస్తాన్, విజ్ఞాన్ పాఠశాల చైర్మన్ ఫక్రుద్దీన్, రెయిన్‌బో పాఠశాల చైర్మన్ జయసింహారెడ్డి, జ్ఞాన సాయి పాఠశాల చైర్మన్ తదితరులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గ్రామ సచివాలయ కార్యదర్శి మస్తాన్, టీడీపీ మండల కన్వీనర్ శెట్టివారి జైచంద్రతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు