అమరావతికి రాచబాట.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం నేడు

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం

రెండు స్టీల్‌ బ్రిడ్జిలకు కూడా ప్రారంభోత్సవం

రాయపూడిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాల స్వీకరణ

మీకోసం న్యూస్ అమరావతి ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అభివృద్ధికి అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఈ రహదారిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో రహదారుల అనుసంధానం, రవాణా సౌకర్యాల విస్తరణలో ఈ మార్గం కీలక పాత్ర పోషించనుండటంతో ప్రారంభోత్సవానికి ప్రాధాన్యం ఏర్పడింది.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు రాజధాని ప్రాంతంలో నిర్మించిన రెండు కీలక స్టీల్‌ బ్రిడ్జిలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం ఇదే మార్గంలో రాయపూడి వరకు ప్రయాణించనున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాలను స్వీకరించి వాటిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కు అప్పగించనున్నారు. ఒకే రోజు రాజధానికి సంబంధించిన మూడు కీలక కార్యక్రమాలు జరగనుండటంతో అమరావతి గ్రామాల్లో సందడి నెలకొంది.

21.77 కిలోమీటర్ల రహదారి

అమరావతిలో రహదారుల అనుసంధానానికి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెన్నెముకగా నిలవనుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో తొమ్మిది లేన్ల రహదారిగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. రహదారి మధ్యలో బీఆర్టీఎస్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్‌ రోడ్లు ఉండేలా నిర్మాణాన్ని చేపట్టారు.

రాజధాని ప్రాంతంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్లే ఎన్‌-1 నుంచి ఎన్‌-17 వరకు ఉన్న రహదారులను సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. భవిష్యత్తులో అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, వాణిజ్య ప్రాంతాలు, ఇతర మౌలిక వసతులు విస్తరించే కొద్దీ ఈ రహదారి ప్రాధాన్యం మరింత పెరగనుంది.

మూడు దశల్లో నిర్మాణం

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణాన్ని మూడు దశల్లో చేపడుతున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. రాజధాని ప్రాంతంలోని ప్రధాన గ్రామాలు, రహదారులను కలుపుతూ నిర్మిస్తున్న ఈ మార్గం భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

రెండో దశలో భాగంగా కీలకమైన రెండు స్టీల్‌ బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఉండవల్లి వద్ద బకింగ్‌హామ్‌ కాలువపై 110 మీటర్ల పొడవైన స్టీల్‌ బ్రిడ్జి, అలాగే కొండవీటి వాగుపై 280 మీటర్ల పొడవైన స్టీల్‌ బ్రిడ్జి నిర్మించారు. ఈ రెండు వంతెనలు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు అనుసంధానంలో కీలకంగా మారనున్నాయి.

జాతీయ రహదారికి అనుసంధానం

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు దొండపాడు నుంచి ప్రారంభమై తాడేపల్లి వద్ద జాతీయ రహదారి-16 (ఎన్‌హెచ్‌-16)తో అనుసంధానం కానుంది. దీంతో అమరావతి రాజధాని ప్రాంతం జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో మరింత మెరుగ్గా అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది.

రాజధాని నిర్మాణంలో రహదారులే ప్రధాన మౌలిక వసతులుగా భావిస్తున్న ప్రభుత్వం వాటి నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతి ప్రాంతంలో రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది. రాజధాని పరిధిలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాల భవనాలకు చేరుకోవడం కూడా సులభతరం కానుంది.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లకు తాళాలు

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు రాయపూడికి వెళ్లనున్నారు. అక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాలను స్వీకరించి జీఏడీకి అప్పగించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటం అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు.

రాజధానిలో శాసనసభ, సచివాలయం తదితర కీలక ప్రభుత్వ కార్యకలాపాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నివాస సముదాయాలు, రహదారులు, వంతెనలు అందుబాటులోకి రావడం ద్వారా రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

గ్రామాల్లో సందడి

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అమరావతి రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభంతో తమ ప్రాంతంలో రాకపోకలు మరింత మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాజధాని నిర్మాణంలో కీలకమైన రహదారి ప్రారంభం, రెండు స్టీల్‌ బ్రిడ్జిల ప్రారంభోత్సవం, ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ క్వార్టర్లను జీఏడీకి అప్పగించడం.. ఇలా మూడు కార్యక్రమాలు ఒకే రోజు జరగనుండటంతో అమరావతి అభివృద్ధిలో గురువారం కీలక రోజుగా నిలవనుంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రాజధాని ప్రగతికి రాచబాటగా మారనుందని అధికారులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు