తేదీ | సమయం

బాడుగ బండిపై బజ్జీల విక్రయం.. మాట నిలబెట్టుకున్న మంత్రి సవిత

భర్తను కోల్పోయిన మహిళకు సొంత తోపుడు బండి అందజేత.. పిల్లల చదువుకు భరోసా

మీకోసం న్యూస్ | గోరంట్ల ఆగస్ట్ 27:
భర్తను కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, బాడుగ తోపుడు బండిపై బజ్జీలు విక్రయిస్తూ తన కుమారుడు, కుమార్తెను చదివించుకుంటున్న లీలావతికి రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ అండగా నిలిచారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి, ఇచ్చిన మాట ప్రకారం సొంత తోపుడు బండిని అందజేశారు.

బుధవారం గోరంట్ల పట్టణంలో పర్యటించిన మంత్రి సవితమ్మను బస్టాండ్ సమీపంలో బాడుగ తోపుడు బండిపై బజ్జీలు విక్రయిస్తున్న లీలావతి కలిశారు. తన భర్త మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలను తానే మోస్తున్నానని, బాడుగకు తోపుడు బండి తీసుకుని బజ్జీలు విక్రయిస్తూ వచ్చే ఆదాయంతో పిల్లలను చదివిస్తున్నానని ఆమె మంత్రికి వివరించారు.

బాడుగ బండి కారణంగా ప్రతి రోజు కొంత ఆదాయాన్ని కోల్పోతున్నానని, తనకు సొంత తోపుడు బండి ఏర్పాటు చేసి ఇవ్వాలని లీలావతి మంత్రిని కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి.. మరుసటి రోజే సాయం

లీలావతి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి సవితమ్మ వెంటనే స్పందించారు. “రేపు పెనుకొండ క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవండి.. తప్పకుండా మీకు సొంత తోపుడు బండి ఏర్పాటు చేస్తాను” అని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం గురువారం లీలావతిని పెనుకొండ క్యాంపు కార్యాలయానికి పిలిపించి, ఆమె జీవనోపాధికి ఉపయోగపడేలా సొంత తోపుడు బండిని మంత్రి సవితమ్మ అందజేశారు.

ఇక బాడుగ భారం ఉండదు”

సొంత తోపుడు బండి అందడంతో ఇకపై బాడుగ భారం లేకుండా తన వ్యాపారం కొనసాగించవచ్చని లీలావతి తెలిపారు. వచ్చే ఆదాయంతో తన పిల్లలను మరింత బాగా చదివించుకునేందుకు అవకాశం కలిగిందని చెప్పారు.

తన పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించడంతో పాటు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి సవితమ్మకు లీలావతి కృతజ్ఞతలు తెలిపారు.

స్వయం ఉపాధికి అండగా నిలవడమే లక్ష్యం

పేదలు, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేలా వారికి అవసరమైన సహకారం అందించడమే తమ లక్ష్యమని మంత్రి సవితమ్మ తెలిపారు. కష్టపడి జీవనం సాగించే వారికి ప్రోత్సాహం అందిస్తే వారు తమ కుటుంబాలను తామే నిలబెట్టుకోగలరని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గోరంట్ల పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మహిళకు అందిన సాయం ఒక కుటుంబానికి మాత్రమే కాదు.. స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఒక భరోసాగా నిలిచింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు