మరో ముగ్గురికి ఛార్జ్‌మెమోలు – జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
మీకోసం న్యూస్,అనంతపురం, ఆగస్టు 17: తాడిపత్రి మండలం తాడిపత్రి గ్రామంలోని సర్వే నంబర్ 770-E2లోని 2.40 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A(1)(d) కింద నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన నలుగురు రెవెన్యూ ఉద్యోగులపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నలుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ముగ్గురికి ఛార్జ్‌మెమోలు జారీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ భూ వ్యవహారానికి సంబంధించిన రెవెన్యూ, ల్యాండ్ సీలింగ్ రికార్డులను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సమగ్రంగా పరిశీలించారు. పరిశీలనలో ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్‌లోని నమోదుల్లో మార్పులు జరిగినట్లు కనిపించడం, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్‌లో 17, 18 పేజీలు కనిపించకపోవడం, 1-B రిజిస్టర్, అడంగల్‌లో భూమి డి.పట్టా (L.C.)గా నమోదై ఉండటం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అదేవిధంగా సంబంధిత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ‘సీలింగ్ ల్యాండ్’గా పేర్కొనడం, ఆర్డీఓ కార్యాలయంలోని ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్‌లో C.C.No.2963/75 TDP కింద సర్వే నంబర్ 770-E2లోని 2.40 ఎకరాలకు సంబంధించిన నమోదు ఉండటం వంటి అంశాలను అధికారులు గుర్తించారు.
నలుగురి సస్పెన్షన్
తాడిపత్రి అప్పటి తహసీల్దార్ (ఎఫ్‌ఏసీ), ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న జి. సోమశేఖర్, సంబంధిత రెవెన్యూ, ల్యాండ్ సీలింగ్ రికార్డులను పూర్తిగా పరిశీలించకుండానే ప్రతిపాదన సమర్పించారని, రికార్డుల్లోని వ్యత్యాసాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదన్న అభియోగాలపై సస్పెండ్ చేసి ఛార్జ్‌మెమో జారీ చేశారు.
మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. ఈశ్వర్‌రెడ్డి అవసరమైన విచారణ నివేదిక సమర్పించకపోవడం, సంబంధిత రికార్డులను సక్రమంగా ధృవీకరించకపోవడం వంటి అభియోగాలపై సస్పెండ్ చేశారు.
గ్రామ రెవెన్యూ అధికారి కె. వెంకటస్వామి అవసరమైన విచారణ, ధృవీకరణ చేయకపోవడం, కీలక అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు.
అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఎస్. మహమ్మద్ షఫీ ల్యాండ్ సీలింగ్ రికార్డులను సక్రమంగా పరిశీలించకుండా ఎండార్స్‌మెంట్ జారీ ప్రక్రియలో వ్యవహరించారని, కీలక రికార్డు నమోదులను అధికారుల దృష్టికి తీసుకురాలేదన్న ఆరోపణలపై సస్పెండ్ చేశారు.
మరో ముగ్గురికి ఛార్జ్‌మెమోలు
అనంతపురం ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ యు. రాజేంద్రప్రసాద్, ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్‌లోని C.C.No.2963/75 TDP, Sy.No.770-E2 నమోదును పరిశీలించకపోవడం, వ్యత్యాసాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంతో ఛార్జ్‌మెమో జారీ చేశారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ల్యాండ్ రిఫార్మ్స్ విభాగంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. పవన్‌కుమార్ సంబంధిత భూ ఫైల్‌ను పరిశీలించే సమయంలో ల్యాండ్ సీలింగ్ రికార్డులను సక్రమంగా పరిశీలించలేదన్న అభియోగంపై ఛార్జ్‌మెమో జారీ చేశారు.
అనంతపురం ఆర్డీఓ కార్యాలయం అప్పటి డీఏఓ (ఇన్‌చార్జి) ఎస్.బి. కుళ్లాయప్ప ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్‌లోని కీలక నమోదులను పరిశీలించకపోవడం, సంబంధిత రికార్డులతో ప్రతిపాదనను సరిపోల్చి వ్యత్యాసాలను కాంపిటెంట్ అథారిటీ దృష్టికి తీసుకురాకపోవడంతో ఛార్జ్‌మెమో జారీ చేశారు.
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, మరో ముగ్గురికి ఛార్జ్‌మెమోలు జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
ప్రభుత్వ భూములు, ల్యాండ్ సీలింగ్ భూములు, నిషేధిత ఆస్తులకు సంబంధించిన రికార్డుల పరిశీలనలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, రికార్డుల ధృవీకరణలో లోపాలు గుర్తించిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
0 కామెంట్‌లు