లాభాపేక్ష లేకుండా కలప సరఫరా.. నిర్వహణ వ్యయమే వసూలు చేయాలి
ఆరు ప్రాంతాల్లో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు’.. దళారుల వ్యవస్థకు చెక్ పెట్టేలా చర్యలు
అమరావతి,మీకోసం న్యూస్ ఆగస్టు 11: రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళాకారులకు అవసరమైన ముడిసరుకును అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాణ్యమైన కలపను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, సేకరణ, రవాణా, నిల్వకు అయ్యే వాస్తవ నిర్వహణ వ్యయానికే అందించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల’ ఏర్పాటుపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. కలప కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంప్రదాయ కళాకారులకు ముడిసరుకు సులభంగా లభించేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
దళారుల ప్రమేయానికి చెక్
కలప సేకరణ, రవాణా, నిల్వకు అయ్యే వాస్తవ వ్యయాన్ని మాత్రమే కళాకారుల నుంచి వసూలు చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కళాకారులకు ముడిసరుకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దళారుల వ్యవస్థ తొలగితే కళాకారులకు కలప తక్కువ వ్యయంతో లభించడంతో పాటు వారి ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా సంప్రదాయ హస్తకళలకు మరింత ప్రోత్సాహం లభించి, కళాకారుల జీవనోపాధికి భరోసా కలుగుతుందని పేర్కొంది.
ఆరు ప్రాంతాల్లో వుడ్ బ్యాంకులు
రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి ప్రాంతాల్లో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రాంతీయ హస్తకళలకు అవసరమైన నిర్దిష్ట కలప జాతులను ఆయా వుడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచనున్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపొనికి, ఏటికొప్పాక హస్తకళలకు ఉపయోగించే అంకుడు వంటి కలపను సరఫరా చేయనున్నారు.
అదేవిధంగా బొబ్బిలి వీణల తయారీలో ఉపయోగించే పనస, రోజ్‌వుడ్ తదితర కలప జాతులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
రాజమహేంద్రవరం కేంద్రంగా మరిన్ని కలప జాతులు
రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు, టేకు వంటి ముడిసరుకులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టనున్నారు. వివిధ ప్రాంతాల్లోని హస్తకళా ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకును గుర్తించి, దాని లభ్యతను బట్టి సరఫరా వ్యవస్థను రూపొందించాలని అధికారులు సూచించారు.
అరుదైన కలప జాతులపై దృష్టి
అరుదైన కలప జాతులు ఎక్కడ, ఎంత మేరకు లభిస్తున్నాయో సమగ్రంగా మ్యాపింగ్ చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో హస్తకళాకారులకు ముడిసరుకు కొరత రాకుండా, అరుదైన కలప జాతులను అటవీ నర్సరీల్లో పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సంప్రదాయ హస్తకళలకు అవసరమైన ముడిసరుకును సకాలంలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, రాష్ట్రంలోని ప్రసిద్ధ హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com

0 కామెంట్‌లు