మల్లాపల్లిలో ఘనంగా ‘మాలల మేలుకొలుపు’ సభ
మీకోసం న్యూస్ – పుట్టపర్తి, ఆగస్టు 14:
‘పల్లె పిలుపు’ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలం మల్లాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ‘మాలల మేలుకొలుపు’ సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ మాల మహానాడు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎం.ఎన్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎం.ఎన్. మూర్తి మాట్లాడుతూ ఎస్సీ కులాల్లో మాలల త్యాగాల చరిత్ర ఎంతో గొప్పదని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు సమాజ నిర్మాణంలో మాలల పాత్ర కీలకంగా ఉందని గుర్తు చేశారు. మాల జాతి యువత విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు ఉన్నత విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. మాల జాతి ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం మాల మహానాడు నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
దళితుల ఐక్యతే తమ బలమని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మూర్తి అన్నారు. మల్లాపల్లి గ్రామస్థులు తమ దృష్టికి తీసుకొచ్చిన మంచినీరు, ఇళ్ల నిర్మాణం, రహదారులు తదితర సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో నిర్వహించనున్న ‘మాలల ఆత్మీయ సమ్మేళనం’ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో మాలల మధ్య ఐక్యత, విద్య, హక్కులపై మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారు, డీవీఎంసీ సభ్యుడు శోధనపల్లి రామాంజనేయులు, జిల్లా నాయకులు, బుక్కపట్నం ఎంపీటీసీ ఈశ్వర్, పుట్టపర్తి టీసీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మాల కులస్తులు, విద్యార్థులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో ‘జై మాల.. జై జై మాల’, ‘జై భీమ్.. జై జై భీమ్’ నినాదాలు మారుమోగాయి.
0 కామెంట్‌లు