మీకోసం న్యూస్,న్యూఢిల్లీ ఆగస్ట్ 22: భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ అంతరిక్ష రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఢిల్లీలో 20 దేశీయ అంతరిక్ష అంకుర సంస్థల (స్టార్టప్స్) సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, ప్రైవేటు రంగం భాగస్వామ్యం వంటి అంశాలపై వారితో చర్చించారు.
భారత్‌లో అంతరిక్ష రంగానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి దేశ అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. అంతరిక్ష సాంకేతికత కేవలం ఉపగ్రహ ప్రయోగాలు, పరిశోధనలకు మాత్రమే పరిమితం కాకుండా సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యంగా వ్యవసాయం, పశుపోషణ, వాతావరణ అంచనాలు, ప్రకృతి వైపరీత్యాల ముందస్తు సమాచారం, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రజోపయోగ రంగాల్లో అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించాలని ప్రధాని సూచించారు.
యువ స్టార్టప్ వ్యవస్థాపకులు తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మోదీ కోరారు. దేశీయంగా అభివృద్ధి చేసే అంతరిక్ష సాంకేతికత భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత బలమైన స్థానానికి తీసుకెళ్లగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అంతరిక్ష రంగంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, స్టార్టప్స్ కలిసి పనిచేస్తే కొత్త ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. యువత ప్రతిభకు అవకాశాలు కల్పిస్తూ, భారత అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు.
0 కామెంట్‌లు