హిందూపురం పట్టణ సీఐ రాజగోపాల్ నాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్.. సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం
పెనుకొండ, ఆగస్టు 1 (మీకోసం న్యూస్): హిందూపురం పట్టణ సీఐ రాజగోపాల్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం పెనుకొండ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
దళిత సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల హిందూపురం పట్టణంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణి మృతి చెందిన ఘటనపై తీవ్ర వివాదం నెలకొంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. అంతేకాకుండా, ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వారు ఆరోపించారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకోగా, అక్కడ విధుల్లో ఉన్న హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు ఆయనతో అనుచితంగా ప్రవర్తించారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. బూట్లతో తన్నడంతో పాటు తీవ్ర అవమానకరమైన పదజాలంతో దూషించారని, సామాజికంగా కించపరిచేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఘటన దళిత సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పోలీసు అధికారి ప్రవర్తించారని విమర్శించారు.
ఈ ఘటనపై గత రెండు మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దళిత సంఘాలు, బహుజన సంఘాలు నిరసనలు చేపడుతున్నాయని నాయకులు తెలిపారు. హిందూపురం, సోమందేపల్లి, పెనుకొండ, రొద్దం తదితర ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూ సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వివరించారు.
శనివారం నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో దళిత, బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని "సీఐ రాజగోపాల్ నాయుడిని సస్పెండ్ చేయాలి", "ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి", "దళితులపై దౌర్జన్యాలు ఆపాలి", "న్యాయం చేయాలి" అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముగిసింది.
అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు సబ్ కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అందులో సీఐ రాజగోపాల్ నాయుడిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడిగా తేలితే వెంటనే సస్పెండ్ చేయాలని, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దళితుల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన సబ్ కలెక్టర్ ఆనంద్ స్పందిస్తూ, తమకు అందిన ఫిర్యాదును పరిశీలించి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకునేలా నివేదిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారులు ప్రజలతో గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచివి కావని పేర్కొన్నారు. దళితులపై అవమానకరంగా ప్రవర్తించిన ఘటనలపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక సంఘం సీనియర్ నాయకులు రామాంజినేయులు, రొద్దం బాబు, సోమందేపల్లి మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, కంబాలప్ప, కొగిర గంగాధర్, యంగ్ ఇండియా వెంకటేష్, కొనపురం కొల్లప్ప, కార్యదర్శి పెనుకొండ రవికుమార్, రంగేపల్లి నాగరాజు, చల్లపల్లి ఈశ్వర్, హరిలాల్ నాయక్, హ్యాండ్స్ నారాయణ, మునిమడుగు నరసింహులు, రాంపురం రామాంజినప్ప, నాగలూరు శివ, మంచెపల్లి మల్లికార్జున, పందిపర్తి మాజీ ఎంపీటీసీ మూర్తి, శ్రీనివాసులు, కంబాలపల్లి నరేష్, రంగేపల్లి కదిరప్ప, శెట్టిపల్లి తులసి, ఆడదాకులపల్లి రెండువేలు, ప్రవీణ్, పెనుకొండ పవన్, రిటైర్డ్ వీఆర్వో గోవిందప్ప, సోమందేపల్లి సంజీవ్ రాయుడు, గంగారాం, పెయింటర్ రామాంజినేయులు, వరలక్ష్మి, ముత్యాల్, చెర్లపల్లి రామచంద్ర, హనుమంతు నాయక్, లక్ష్మణ్ నాయక్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత, బహుజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు