మడకశిర ఎస్సీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారానికి విశేష స్పందన

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు

మడకశిర, ఆగస్టు 7 (మీకోసం న్యూస్): కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో చేపట్టిన డోర్ టు డోర్ (D2D) ప్రచార కార్యక్రమానికి మడకశిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో విశేష స్పందన లభించింది. జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.

ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు సూచిస్తున్న ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తోందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ప్రచారంలో భాగంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన ప్రధాన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు