మీకోసం న్యూస్ కదిరి ఆగష్టు 07 :
కదిరి: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి యువకుడు బాధ్యతగా ముందుకు రావాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా సమాజంలో కూడా అవగాహన కల్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కదిరి పరిధిలోని కుటాగుళ్లలో ఉన్న ఓబులేశ్వర అకాడమీలో నిర్వహించిన "డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబ భవిష్యత్తును, సమాజ శాంతిభద్రతలను కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన సామాజిక వ్యసనమని అన్నారు. యువత తమ జీవిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని సూచించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల ప్రజల్లో కూడా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఎన్‌డీపీఎస్ చట్టం–1985లో ఉన్న కఠిన నిబంధనలను వివరిస్తూ, గంజాయిని స్మాల్, ఇంటర్‌మీడియట్, కమర్షియల్ క్వాంటిటీలుగా వర్గీకరిస్తారని తెలిపారు. నేర తీవ్రతను బట్టి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రతి యువకుడికి చట్టాలపై అవగాహన ఉండడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై చేపట్టిన చర్యలను గుర్తు చేసిన ఎస్పీ, డ్రగ్స్ కారణంగా ఎన్నో కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. క్షణిక ఆనందం కోసం తీసుకునే తప్పు నిర్ణయం జీవితాంతం బాధను మిగులుస్తుందని, అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
యువత జీవితంలో క్రమశిక్షణ, కఠోర శ్రమ, దేశసేవ అనే మూడు విలువలు ఎంతో ముఖ్యమని ఎస్పీ అన్నారు. యూనిఫాం ధరించడం కేవలం ఉద్యోగం కాదని, దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. పోలీసు శాఖ, సైన్యం, కేంద్ర సాయుధ దళాల్లో సేవ చేయాలనే లక్ష్యంతో యువత ఇప్పటి నుంచే కష్టపడి సిద్ధం కావాలని ప్రోత్సహించారు.
కార్యక్రమంలో గర్ల్స్ కమాండోలు అందించిన గార్డ్ ఆఫ్ ఆనర్, డ్రిల్ ఫార్మేషన్స్, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణను అభినందించిన ఎస్పీ, నిరంతర సాధనతోనే ఉన్నత విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. దేశభక్తి, సేవాభావం, చట్టాల పట్ల గౌరవంతో యువత ముందుకు సాగితే సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని ఆకాంక్షించారు.
జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తత పెంచడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే దిశగా ఉపయోగపడిందని పలువురు అభిప్రాయపడ్డారు.
✍️ Editor: Prakash | Meekosam.in
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com
0 కామెంట్‌లు