టెంకాయ కొట్టింది మేమే... గుమ్మడికాయ కొట్టిందే మేమే.. భోగాపురం క్రెడిట్ మాదే

పెనుకొండలో బీసీ గురుకుల పాఠశాల ప్రారంభించిన మంత్రి సవిత

"అభివృద్ధే మా క్రెడిట్.. విధ్వంసం వారి క్రెడిట్" అంటూ వైసీపీపై విమర్శలు

పెనుకొండ, ఆగస్టు 2 (మీకోసం న్యూస్): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తమ ప్రభుత్వమేనని, ప్రారంభోత్సవం నిర్వహించింది కూడా కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రి సవిత స్పష్టం చేశారు. "టెంకాయ కొట్టింది మేమే... గుమ్మడికాయ కొట్టింది కూడా మేమే. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ పూర్తిగా మాదే" అని ఆమె పేర్కొన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. బీసీల అభ్యున్నతికి విద్యే ప్రధాన మార్గమనే నమ్మకంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామని, అందులో భాగంగానే పెనుకొండలో బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, వసతి, భద్రత, క్రీడా ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఆరు బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. గురుకుల విద్యార్థులకు ట్రాక్‌సూట్లు, క్రీడా బూట్లు ఇప్పటికే అందించామని, త్వరలో స్పోర్ట్స్ కిట్లు కూడా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

పెనుకొండ నియోజకవర్గంలోని గురుకులాలు, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. రూ.3 కోట్లతో కేజీబీవీ పాఠశాల అభివృద్ధి చేపట్టామని, రొద్దం, గోరంట్ల, సోమందేపల్లిలో బీసీ హాస్టళ్లను ప్రారంభించామని తెలిపారు. త్వరలో పెనుకొండలో ఎస్సీ గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. "హంతకులను పరామర్శించే క్రెడిట్ జగన్‌ది. పేదల కోసం నడిచిన అన్న క్యాంటీన్లను మూసివేసిన క్రెడిట్ కూడా వారిదే. అమరావతిని పక్కనబెట్టి రాజధానిని మూడు ముక్కలు చేసిన క్రెడిట్ వైసీపీదే. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు సంచి సిమెంట్ కూడా వేయని ప్రభుత్వం తమకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేద"ని విమర్శించారు.

"విధ్వంసం, క్రెడిట్ చోరీలు మాకు అవసరం లేదు. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధే అసలు క్రెడిట్. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సాకారం చేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్రెడిట్ పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే" అని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు