అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్

అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తప్పవు

బుక్కపట్నం, ఆగస్టు 11 (మీకోసం న్యూస్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుక్కపట్నం చెరువు సమీపంలోని కమ్మవారిపల్లి వద్ద మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యంత్రాల సహాయంతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి సీజ్‌ చేశారు.

స్వాధీనం చేసుకున్న రెండు ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బుక్కపట్నం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

అక్రమ రవాణాపై నిఘా

జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించవద్దని వాహనదారులకు సూచించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ తనిఖీల్లో ఏడీ మైన్స్‌ అమీర్‌ బాషా, సునీతాబాయి, సర్వేయర్‌, మైన్స్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు