మీకోసం NEWS తేదీ లోడ్ అవుతోంది…|సమయం --:--
హోమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జాతీయం భక్తి సినిమా
తాజా వార్తలు
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కవి కాకి కోగిర జై సీతారాం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు!

పెనుకొండలో ‘సుగుణ సౌవిధిని’ పుస్తకావిష్కరణ.. కవి సేవలను కొనియాడిన మున్సిపల్ చైర్మన్ త్రివేంద్రమూర్తి

మీకోసం NEWS | పెనుకొండ

తన కలం ద్వారా ఎన్నో భావాలను కవితలుగా మలిచి, సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి కాకి కోగిర జై సీతారాం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పెనుకొండ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్రమూర్తి అన్నారు. ఆయన రచనలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

పెనుకొండ పట్టణంలోని అఫీషియల్ క్లబ్‌లో కవి కాకి కోగిర జై సీతారాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సుగుణ సౌవిధిని’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ త్రివేంద్రమూర్తి మాట్లాడుతూ.. కవి కాకి కోగిర జై సీతారాం ఎన్నో కవితలు రచించి సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అలాంటి గొప్ప కవి ఈ ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

కవి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆయన రచించిన కవితలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. సాహిత్యానికి సేవలందించిన కవులు, రచయితల రచనలను గుర్తించి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక సాహితీవేత్తల ప్రతిభను సమాజానికి పరిచయం చేయాలని సూచించారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కవులు, సాహితీవేత్తలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం సాహితీ అభిమానుల మధ్య ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, కోగిర జయచంద్ర, కోనాపురం ఈశ్వరయ్య, కేశవయ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

కవి కలం నుంచి జాలువారిన అక్షరాలు కాలంతో పాటు చెరిగిపోవు. ఆయన రచనలను పుస్తక రూపంలో భద్రపరచి ప్రజలకు అందించడం ద్వారా కవి కాకి కోగిర జై సీతారాం సాహిత్య సేవలను మరోసారి స్మరించుకునే అవకాశం కలిగింది.

మీకోసం NEWS
నిజం మా ధర్మం | ప్రజలే మా శక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు