శాంతి భద్రతలే లక్ష్యం.. సమాజ సేవే ధ్యేయం: ఎస్‌ఐ సుధాకర్ యాదవ్

 మీకోసం న్యూస్ | సోమందేపల్లి జూలై 05

సోమందేపల్లి : మొహరం పండుగ సందర్భంగా సోమందేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సోమందేపల్లి మండల కేంద్రంలో పాణకాలు ముగించుకుని ముస్లిం, హిందూ సోదరులు సంప్రదాయబద్ధంగా అలావ్ నిర్వహించారు.

వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తూ పోలీసు సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, "కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పండుగ అందరి పండుగ. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఐక్యతతో పాల్గొని ఒకే కుటుంబ సభ్యుల్లా సంబరాలు జరుపుకోవాలి. శాంతి భద్రతలను కాపాడడం మా లక్ష్యం, సమాజ సేవే మా ధ్యేయం" అని అన్నారు.

అదే సమయంలో పండుగ వేళ ఎవరైనా కావాలనే గొడవలు సృష్టించినా, అల్లర్లకు పాల్పడినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దిగినా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజల సహకారంతో పండుగను విజయవంతంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు