ప్రశ్న రావణ్ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం: శేషాద్రి

మీకోసం న్యూస్ | మడకశిర, జూలై 4: సామాజిక కార్యకర్త ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని మడకశిర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి ఖండించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు, ప్రభుత్వాలను విమర్శించే హక్కు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే కేసులు నమోదు చేసి వేధించడం సరైన విధానం కాదని విమర్శించారు.

అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్న రావణ్‌పై వేగంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ పక్షపాత ధోరణిని సూచిస్తోందని ఆరోపించారు. విమర్శలకు చట్టబద్ధంగా సమాధానం ఇవ్వాల్సిందిపోయి అరెస్టులు, కేసులతో స్పందించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను విమర్శించడం నేరం కాదని, భిన్నాభిప్రాయాలను గౌరవించే సంస్కృతి ప్రజాస్వామ్యానికి మూలస్థంభమని శేషాద్రి పేర్కొన్నారు. ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసులను ఉపసంహరించుకుని, ఆయనకు చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు