హిందూపురం, జూలై 7(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి ఆధ్వర్యంలో ఎంఈఓ ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాఠశాలలు విద్యార్థులకు భద్రత కల్పించే పవిత్రమైన ప్రదేశాలని, ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయడంతో పాటు, పాఠశాలల్లో బాలల రక్షణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
అలాగే, ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి బాలల భద్రత, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నాగేంద్ర, బద్రీనాథ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్లు