పీఎస్‌యూ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి


 ధర్మవరం, జూలై 7(మీకోసం న్యూస్ ): ప్రగతిశీల విద్యార్థి సంఘం (పీఎస్‌యూ) జాతీయ సదస్సును విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర పిలుపునిచ్చారు. ధర్మవరం పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1955 నుంచి విద్యార్థుల హక్కులు, విద్యా అవకాశాలు, ఉపాధి సమస్యల పరిష్కారం కోసం పీఎస్‌యూ నిరంతరం పోరాడుతోందన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు పీఎస్‌యూ నాయకత్వం వహిస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగాన్ని కార్పొరేటీకరణ నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు అధిక ఫీజులను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.

జూలై 12న ఢిల్లీలో నిర్వహించనున్న పీఎస్‌యూ జాతీయ సదస్సులో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని విద్య, ఉపాధి, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు