పెనుకొండ, జూలై 6 (మీకోసం న్యూస్): విద్యార్థినుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం పెనుకొండ పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఎస్., ఐపీఎస్ ఆదేశాల మేరకు పీకేడీ ఎస్డీ శక్తి టీమ్-1 ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మైనర్ ప్రేమ వ్యవహారాలు, మైనర్ పరారీల వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, శిక్షలపై విద్యార్థినులకు వివరించారు.
చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, మొబైల్ నంబర్లు, ఓటీపీలు, పాస్వర్డ్లు వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అలాంటి చర్యలు సైబర్ నేరాలు, బ్లాక్మెయిల్, ఆన్లైన్ వేధింపులకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు.
అపరిచితులను నమ్మవద్దని, వారు ఇచ్చే ఆహారం లేదా బహుమతులను స్వీకరించవద్దని సూచించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో 181 మహిళల హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా శక్తి యాప్ ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.


0 కామెంట్లు