మీకోసం న్యూస్ | అమరావతి
సచివాలయంలో లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ ప్రారంభం
ఉద్యోగులకు 10 శాతం రాయితీతో లెదర్ ఉత్పత్తులు
లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేసిన మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, సవిత
అమరావతి, జూలై 8 (మీకోసం న్యూస్): కుల వృత్తిదారులకు శాశ్వత ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరికరాలను అందజేస్తోందని రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి మరియు సవిత తెలిపారు. చర్మకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వారు పేర్కొన్నారు.
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ను బుధవారం మంత్రులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, చర్మకారులకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు మార్కాపురం జిల్లా యడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరు ప్రాంతాల్లో లెదర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిడ్ క్యాప్ సంస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, కుల వృత్తిదారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆధునిక పరికరాల పంపిణీ ద్వారా వారి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్‌లెట్ ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు, సందర్శకులకు నాణ్యమైన లెదర్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయని, సచివాలయ ఉద్యోగులకు 10 శాతం రాయితీపై విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు.
లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల వరప్రసాద్ రావు మాట్లాడుతూ, చర్మకారుల అభివృద్ధికి సంస్థ కట్టుబడి ఉందన్నారు. గతంలో ఆక్రమణలకు గురైన లిడ్ క్యాప్ భూములను పరిరక్షించామని తెలిపారు.
లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేసిన మంత్రులు
షోరూమ్ ప్రారంభం అనంతరం మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, సవిత లెదర్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో లిడ్ క్యాప్ ఎండీ ప్రసన్న వెంకటేశ్, కార్యదర్శి ఎం.ఎం. నాయక్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


0 కామెంట్‌లు