శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఉక్కుపాదం
కొత్తచెరువు (తలమర్ల), గోరంట్ల బొగ్గు భట్టీల నుంచి 40 మంది కార్మికుల రక్షణ
వెట్టిచాకిరీ నిరోధక చట్టం కింద విడుదల పత్రాలు.. రుణాల రద్దు
తక్షణ ఆర్థిక సాయం, వైద్యం.. మహారాష్ట్రకు ప్రత్యేక రవాణా
కాంట్రాక్టర్, బాధ్యులపై చట్టపరమైన కేసులు
మీకోసం న్యూస్,పుట్టపర్తి, ఆగస్టు 20: ఆధునిక వెట్టిచాకిరీ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి, అమానవీయ పరిస్థితుల్లో బొగ్గు భట్టీల వద్ద పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు.
అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని దగా
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన కాంట్రాక్టర్ పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 40 మంది కార్మికులను మోసగించినట్లు అధికారులు గుర్తించారు. అప్పుల ఊబిలోకి నెట్టిన అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కొత్తచెరువు మండలం తలమర్ల, గోరంట్ల ప్రాంతాల సమీపంలోని బొగ్గు భట్టీల వద్ద ప్రమాదకర పనుల్లోకి వారిని తీసుకువచ్చినట్లు తెలిపారు.
కనీస మౌలిక వసతులు లేకుండా, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో కార్మికులు జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్రమైన వేడి, దట్టమైన పొగ మధ్య రాత్రింబవళ్లు పనిచేస్తున్నప్పటికీ, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందకుండా అప్పుల పేరుతో వెట్టిచాకిరీలోకి నెట్టినట్లు వెల్లడైంది.
కలెక్టర్ ఆదేశాలతో తక్షణ చర్యలు
వెట్టిచాకిరీ వ్యవస్థపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పోలీస్, కార్మిక శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తలమర్ల, గోరంట్ల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధితులందరినీ గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వెట్టిచాకిరీ నిరోధక చట్టం కింద వారికి విడుదల పత్రాలు అందించారు. కాంట్రాక్టర్ పేరుతో ఉన్నట్లు పేర్కొన్న అక్రమ రుణాలను రద్దు చేసే చర్యలు చేపట్టారు.
బాధితులకు తక్షణ భోజనం, వసతి కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రయాణ ఖర్చుల కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ప్రత్యేక వాహనాల ద్వారా 40 మంది కార్మికులను వారి స్వరాష్ట్రం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాకు సురక్షితంగా పంపించే ఏర్పాట్లు చేశారు.
బాధితుల కళ్లలో ఆనంద భాష్పాలు
స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. తమను కష్టాల నుంచి బయటకు తీసుకువచ్చిన ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టర్ తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశారని, కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చిందని వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
బాధ్యులపై కఠిన చర్యలు
ఈ వ్యవహారానికి సంబంధించి మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్టర్‌తో పాటు స్థానికంగా సహకరించినట్లు గుర్తించిన వ్యక్తులపై చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వెట్టిచాకిరీ, అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎక్కడైనా వెట్టిచాకిరీ లేదా కార్మికులపై దోపిడీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
0 కామెంట్‌లు