డ్రగ్స్ సేవించడాన్ని అడ్డుకోవడంతో..
పోలీసుల వివరాల ప్రకారం.. గణపతి చక్రవర్తి ఇంటి సమీపంలో నివసించే 19 ఏళ్ల సిద్ధార్థ దాస్, 23 ఏళ్ల ముగ్ధ దాస్ గురువారం రాత్రి చక్రవర్తి ఇంటి పైఅంతస్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వారు డ్రగ్స్ సేవిస్తుండగా శబ్దాలు విన్న గణపతి చక్రవర్తి పైకి వెళ్లి వారిని మందలించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో ఆగ్రహానికి గురైన యువకులు చక్రవర్తిపై దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆయన మెడకు తువ్వాలు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కేకలు విని వచ్చిన భార్యను కూడా..
భర్త కేకలు విని గణపతి చక్రవర్తి భార్య పైఅంతస్తుకు వెళ్లారు. ఆమెకు విషయం తెలిసిపోవడంతో తమ నేరం బయటపడుతుందనే భయంతో ఆమెను కూడా నిందితులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం విషయం బయటకు రాకుండా ఉండేందుకు కుటుంబంలోని ఇద్దరు పిల్లలను సైతం చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హత్యల తర్వాత ఇంట్లోనే స్నానం, భోజనం
నలుగురిని హత్య చేసిన అనంతరం నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు. అదే ఇంట్లో రాత్రంతా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రక్తపు మరకలను తొలగించుకునేందుకు ఇంట్లోనే స్నానం చేసినట్లు, అనంతరం ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తిన్నట్లు దర్యాప్తులో తేలింది.
దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం
తమపై అనుమానం రాకుండా ఘటనను దొంగతనంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోని బీరువాలను తెరిచి, దుస్తులు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. అనంతరం బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు గుర్తించారు.
మృతులకు చెందిన రెండు మొబైల్ ఫోన్లను కూడా సమీపంలోని నీటిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది.
సీసీటీవీ ఆధారంగా అరెస్ట్
సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. అనంతరం సిద్ధార్థ దాస్, ముగ్ధ దాస్‌లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోచుకెళ్లిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

0 కామెంట్‌లు