మహిళల ఆత్మగౌరవానికి ‘స్త్రీ శక్తి’ పథకం తోడ్పాటు : కందికుంట వెంకటప్రసాద్
మీకోసం న్యూస్ – కదిరి, ఆగస్టు 15:
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి పట్టణ ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవం, స్వేచ్ఛాయుత ప్రయాణానికి ‘స్త్రీ శక్తి’ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందన్నారు. పథకం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 87.09 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ప్రతిరోజూ సగటున 23.99 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణాల కోసం ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.3,095 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ బోర్డు రాయలసీమ–కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం మరియు చేనేత శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా తమకు కలుగుతున్న ప్రయోజనాలు, ప్రయాణ సౌలభ్యాన్ని వివరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నాయకులు కొనియాడారు.
కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, మహిళా నాయకురాళ్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు