21న అంబేద్కర్ సర్కిల్‌లో సభ.. ‘VR కాదు.. FIR కావాలి’ అంటూ తీర్మానం
మీకోసం న్యూస్,హిందూపురం, ఆగస్టు 21:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని న్యాయం, సామాజిక సమానత్వం కోసం నిర్వహిస్తున్న **‘హిందూపురం భేరి – న్యాయ సంకల్ప సభ’**కు బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయం కోరే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బహుజన చైతన్య వేదిక (BCV) పిలుపునిచ్చింది.
ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
25 రోజుల న్యాయ పోరాటానికి విజయం
హిందూపురం CI రాజగోపాల్ నాయుడును VRSP తిరుపతికి బదిలీ చేస్తూ IG అనంతపురం ఉత్తర్వులు జారీ చేయడం 25 రోజుల న్యాయ పోరాటానికి తొలి విజయంగా భావిస్తున్నట్లు BCV నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు, భవిష్యత్ న్యాయ పోరాటంపై సభలో తీర్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
‘VR కాదు.. FIR కావాలి’
బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయ పోరాటం, తదుపరి కార్యాచరణపై ప్రసంగించనున్నారు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
సభలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు పూలమాల వేసి ‘జై భీమ్’ నినాదాలు చేయడంతో పాటు, రమ్య శ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించనున్నారు. అనంతరం న్యాయ పోరాటంపై చర్చించి ‘VR కాదు.. FIR కావాలి’ అనే అంశంపై బహిరంగ తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా నలుమూలల నుంచి తరలిరావాలని పిలుపు
పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, మడకశిర, చిలమత్తూరు, లేపాక్షి తదితర ప్రాంతాలతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మండలాల నుంచి బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
“ఇది ఒక పార్టీ సభ కాదు.. న్యాయం కోసం జరిగే ప్రజా సభ. ఇది ఒక వ్యక్తి సభ కాదు.. బహుజనుల ఆత్మగౌరవ సభ” అని BCV ప్రతినిధులు పేర్కొన్నారు.
జై భీమ్.. జై భారత రాజ్యాంగం.. అంటూ ప్రజలంతా సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు