గర్భిణులకు శ్రీమంతం.. చిన్నారులకు అన్నప్రాసన.. అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం
అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సవిత
మీకోసం న్యూస్ | శ్రీ సత్యసాయి జిల్లా | సోమందేపల్లి
సెప్టెంబర్ 28:
సోమందేపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత గర్భిణులకు పసుపు–కుంకుమతో సామూహిక శ్రీమంతం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో మంత్రి మమేకమై అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను పరిశీలించారు.
పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలతో పాటు గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలపై మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
పిల్లల అభివృద్ధికి అంగన్వాడీలు కీలకం
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. గర్భంలో బిడ్డ పడిన నాటి నుంచి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లులు, చిన్నారుల సంక్షేమానికి ఐసీడీఎస్ శాఖ అండగా నిలుస్తోందన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఆహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా.. పిల్లల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్య, మానసిక–శారీరక అభివృద్ధికి పునాది వేసే కేంద్రాలు అని పేర్కొన్నారు.
అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4,200 నుంచి రూ.6,000కు పెంచినట్లు, ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బందికి రూ.12 వేల జీతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బందికి అమ్మ ఒడి పథకం ప్రయోజనం అందేలా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. అలాగే అంగన్వాడీ సిబ్బందికి సెలవు దినాలను పెంచినట్లు చెప్పారు.
“మన అంగన్వాడీ మన బాధ్యత.. మన పిల్లల ఆరోగ్యం – మనందరి బాధ్యత” అనే సందేశంతో ప్రతి కుటుంబం అంగన్వాడీ కేంద్రాల సేవల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి తల్లి, ప్రతి చిన్నారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం
కార్యక్రమంలో భాగంగా సోమందేపల్లి మండల వ్యాప్తంగా సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను మంత్రి సవిత ఘనంగా సన్మానించారు. చిన్నారులు, తల్లుల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె అభినందించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సీడీపీఓ, సూపర్‌వైజర్, మండల అధికారులు, గ్రామ సచివాలయ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, మహిళా నాయకులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
✍️ Editor: Prakash | Meekosam.in
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com
0 కామెంట్‌లు