ఆధునిక హంగులతో ముస్తాబైన మంగళగిరి రైల్వే స్టేషన్రూ.12.56 కోట్లతో అభివృద్ధి... ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభం

మంగళగిరి, జూలై 17 (మీకోసం న్యూస్): అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.
గుంటూరు డివిజన్ పరిధిలోని ఈ స్టేషన్‌లో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, విశాలమైన వేచి ఉండే హాల్స్, మెరుగైన యాక్సెసిబిలిటీ, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.1,570 కోట్లతో అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్లను రూపొందించారు.
అదే సందర్భంగా రూ.5,470 కోట్లకు పైగా విలువైన రైల్వే, జాతీయ రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. పంజాబ్–హిమాచల్ ప్రదేశ్ మధ్య రూ.830 కోట్లతో నిర్మించిన దౌలత్‌పూర్ చౌక్–కటోలి కొత్త రైలుమార్గాన్ని ప్రారంభించడంతో పాటు కటోలి–అంబాలా, అమృత్‌సర్–వారణాసి కొత్త రైళ్లను కూడా ప్రారంభించారు.
దేశ ఆర్థికాభివృద్ధికి వేగం చేకూర్చడం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు