పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పెంచాలిప్రభుత్వానికి ఆవుటాల రమణారెడ్డి విజ్ఞప్తి

ఉమ్మడి అనంతపురం జిల్లా, జూలై 14 (మీకోసం న్యూస్):
వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జూలై 24తో ముగించకుండా ఆగస్టు 15 వరకు పొడిగించాలని మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని, సమీప రోజుల్లోనూ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో గడువును జూలై 15 నుంచి 24 వరకు మాత్రమే పొడిగించడం రైతులకు పెద్దగా ఉపయోగపడదని, ఇది కేవలం కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుందని విమర్శించారు.
జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, చిరుధాన్యాల విత్తనాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. మెట్ట ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వెంటనే సరఫరా చేసి, పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తే వచ్చే రోజుల్లో వర్షాలు కురిసినప్పుడు రైతులు సాగు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆవుటాల రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు