తాడిపత్రి, జూలై 14 (మీకోసం న్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పెన్నా నది బ్రిడ్జిపై మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కొండమీదపల్లె గ్రామానికి చెందిన గజ్జల సుధాకర్ రెడ్డి ట్రాక్టర్‌లో భారీ లోడుతో తాడిపత్రి వైపు వస్తుండగా, బ్రిడ్జిపై కుడివైపు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయింది.
దీంతో అదుపుతప్పిన ట్రాక్టర్ ఇంజిన్ బ్రిడ్జి రక్షణ గోడను బలంగా ఢీకొట్టి అంచున గాల్లో వేలాడుతూ నిలిచిపోయింది. ట్రాలీ మాత్రం బ్రిడ్జిపైనే ఉండిపోవడంతో ఇంజిన్ పెన్నా నదిలో పడకుండా తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ సూరి చాకచక్యంగా ట్రాక్టర్ నుంచి దూకి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. అనంతరం క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను సురక్షితంగా బయటకు తీసే చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కొద్దిసేపు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

0 కామెంట్‌లు