పెట్రోల్ పోసి తగులబెట్టిన హత్య కేసు ఛేదన 'అప్పడాల ప్యాకెట్'తో దొరికిన కీలక క్లూ.. ఇద్దరు నిందితుల అరెస్ట్


 మీకోసం న్యూస్ I రాయదుర్గం 

రాయదుర్గం, జూలై 9 (మీకోసం న్యూస్): ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును అనంతపురం జిల్లా పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. డబ్బు కోసం పథకం రచించి హత్య చేసిన కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను రాయదుర్గం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.

జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కళ్యాణదుర్గం డీఎస్పీ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

ఘటన ఇలా...

జూన్ 23న డి.హిరేహాల్ మండలం పులకుర్తి గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో పూర్తిగా కాలిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు శవంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

'అప్పడాల ప్యాకెట్'తో మలుపు

ఘటనా స్థలంలో లభించిన సగం కాలిన వార్తాపత్రిక, అప్పడాల ప్యాకెట్, కాలిన దుస్తులు, జంధ్యం వంటి ఆధారాలను పోలీసులు సేకరించారు. అప్పడాల ప్యాకెట్ చెన్నైకి చెందిన సంస్థ తయారీదని గుర్తించి దర్యాప్తును కర్ణాటకలోని బళ్లారి వరకు విస్తరించారు. అనంతరం మృతుడు గురురాజు రావుగా గుర్తించారు.

ఏటీఎం కార్డు వినియోగం, సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి జూలై 8న ఓబులాపురం క్రాస్ వద్ద అరెస్టు చేశారు.

డబ్బు కోసమే హత్య

అరెస్టైన బసవరాజు (31), కొట్రేష్ (36) ఇద్దరూ మూగ, చెవిటి వ్యక్తులు కావడంతో ప్రత్యేక సైన్ లాంగ్వేజ్ నిపుణుల సాయంతో విచారణ నిర్వహించారు. మృతుడి వద్ద ఉన్న డబ్బును దోచుకోవాలనే ఉద్దేశంతో ముందుగా మద్యం తాగించి, అనంతరం కళ్లలో కారంపొడి చల్లి, తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి, బైక్, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డుతో పరారైనట్లు వెల్లడించారు.

స్వాధీనం

నిందితుల వద్ద నుంచి టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనం, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్, అప్పడాల మూటను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు బృందానికి అభినందనలు

ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా శాస్త్రీయ దర్యాప్తు, ఫోరెన్సిక్ విశ్లేషణ, సీసీటీవీ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ పి. జగదీష్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు