అదిగో పులి... ఇదిగో పులి..! గోరంట్లలో చిరుత కలకలం

గోరంట్ల, జూలై 16 (మీకోసం న్యూస్): గోరంట్ల మండలంలో చిరుతపులి సంచరిస్తోందన్న ప్రచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రెడ్డిచెరువు కట్ట ప్రాంతంలో చిరుత కనిపించిందన్న సమాచారంతో మొదలైన కలకలం... జీనంవాండ్లపల్లి, కొత్త బయన్నపల్లి, పూజమ్మ గుడి, మల్లాపల్లి జగనన్న లేఅవుట్ ప్రాంతాలకు విస్తరించింది. దీంతో గ్రామాల్లో రాత్రి వేళ ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం బుధవారం రాత్రి పూజమ్మ గుడి సమీపంలో రహదారి దాటుతూ చిరుత కనిపించిందని, గురువారం రాత్రి సూర్యదేవర (వేమ నారాయణరెడ్డి) పాఠశాల, మల్లాపల్లి జగనన్న లేఅవుట్ పరిసరాల్లోనూ సంచరించిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు బూదిలి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ చిరుత ఆనవాళ్లు కనిపించలేదని తెలిసింది. దీంతో చిరుత నిజంగానే సంచరిస్తోందా..? లేక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా..? అన్న సందిగ్ధం నెలకొంది.
ఒకవైపు ప్రచారాలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి, మరోవైపు ఆధారాలు దొరకకపోవడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చిరుత సంచారం ఉంటే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ డ్రోన్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని మండలవాసులు కోరుతున్నారు. అప్పటి వరకు రాత్రి వేళ అనవసరంగా బయట తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు