అమరావతి కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరటసీఐడీ కేసు కొట్టివేసిన హైకోర్టు.. రాజకీయ ప్రతీకారమేనని వ్యాఖ్య

అమరావతి, జూలై 17 (మీకోసం న్యూస్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే రాజకీయ ధోరణికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి సందేశం ఇచ్చింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి. నారాయణపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు రాజకీయ ప్రతీకారంతో నమోదు చేసినదేనని, ప్రజాప్రయోజనం దృష్ట్యా సమర్థించదగినది కాదని న్యాయస్థానం పేర్కొంది.
హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులను వేధించే సాధనంగా కాకుండా, బలహీనులను రక్షించే కవచంగా ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు భవిష్యత్తులో కేసుల భయంతో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని భూసమీకరణ కోసం తీసుకొచ్చిన జీవో-41 వల్ల తాము నష్టపోయామని ఒక్క రైతు కూడా కోర్టును ఆశ్రయించలేదని న్యాయస్థానం గుర్తుచేసింది. అలాంటి పరిస్థితిలో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదేళ్ల తర్వాత సీఐడీకి ఫిర్యాదు చేయడం ప్రజాప్రయోజనం కోసం కాదని, రాజకీయ ఉద్దేశంతో చేసిన చర్యగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
దర్యాప్తు ప్రక్రియలోనూ నిబంధనలు పాటించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగ్నిజబుల్ నేరాల విషయంలో సంబంధిత యూనిట్ అధికారి నుంచి అధికారిక అభ్యర్థన వచ్చిన తర్వాతే సీఐడీ దర్యాప్తు చేపట్టాల్సి ఉండగా, ఈ కేసులో ఎమ్మెల్యే నేరుగా సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు చేసి, దాని ఆధారంగా విచారణ ప్రారంభించడం చట్టబద్ధం కాదని పేర్కొంది.
అలాగే సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రభుత్వ విధాన నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశం లేదని స్పష్టం చేస్తూ, చంద్రబాబు నాయుడు, నారాయణలపై నమోదైన సీఐడీ కేసును పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు