21 ఏళ్లలో 25 బదిలీలు... అయినా వెనక్కి తగ్గని ఐఏఎస్!కల్తీ మాఫియాపై తుకారాం ముండే ఉక్కుపాదం

ముంబై, జూలై 17 (మీకోసం న్యూస్): మహారాష్ట్రలో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (FDA) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కల్తీ ఆహార ఉత్పత్తులపై వరుస దాడులు నిర్వహిస్తూ కల్తీ మాఫియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

'సేఫ్ ఫుడ్ – సేఫ్ మెడిసిన్స్ – సేఫ్ మహారాష్ట్ర' లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో డెయిరీలు, రెస్టారెంట్లు, తయారీ యూనిట్లపై అధికారులు దాడులు నిర్వహించారు. పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల్లో లోపాలు గుర్తించడంతో ముంబైలోని ప్రముఖ పార్శీ డెయిరీ ఫామ్ ఆహార లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఈ తనిఖీల్లో రూ.1.90 కోట్లకు పైగా విలువైన కల్తీ ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

కల్తీపై కఠిన చర్యలు

బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కల్తీ పాలు, పాల ఉత్పత్తులు, రసాయనాలతో మాగబెట్టిన మామిడిపండ్లు, నిషేధిత గుట్కా, తప్పుడు లేబుళ్లతో విక్రయిస్తున్న నూనెలపై వందలాది తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు యూనిట్లను మూసివేయించడంతో పాటు, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

21 ఏళ్లలో 25 బదిలీలు

2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తుకారాం ముండే తన 21 ఏళ్ల సేవా కాలంలో 25 సార్లు బదిలీ అయ్యారు. అవినీతి, అక్రమాల విషయంలో రాజీపడని వైఖరితో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తరచూ బదిలీలు ఎదురైనా నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన తుకారాం ముండే చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు