మంత్రి నారా లోకేష్ స్పందించి ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి
కర్నూలు, జూలై 30 (మీకోసం న్యూస్): కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన జె. విజయ్ కుమార్ (35) అరుదైన వాస్క్యులర్ వ్యాధితో గత తొమ్మిది నెలలుగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసరంగా వాస్క్యులర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచించగా, అందుకు సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రభుత్వ పరంగా ఆదుకొని తన భర్త ప్రాణాలను కాపాడాలని భార్య మారెమ్మ మంత్రి నారా లోకేష్‌ను వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, విజయ్ కుమార్‌కు పొట్ట భాగంలోని ప్రధాన రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిని పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో ఊపిరితిత్తులు, మెదడు సహా శరీరంలోని కీలక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరగడం లేదని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి తీవ్రత కారణంగా ఆహారం తీసుకున్న ప్రతిసారీ తీవ్రమైన కడుపు నొప్పి, చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఘన ఆహారం తీసుకోలేని పరిస్థితి ఏర్పడి గంజి వంటి ద్రవాహారంతోనే జీవనం కొనసాగిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
వ్యాధి నిర్ధారణ అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు, హైదరాబాద్, బెంగళూరులోని పలు ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. అనంతరం తమిళనాడులోని వెల్లూరులో ఉన్న ప్రముఖ ఆసుపత్రిలో సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆలస్యం చేయకుండా వాస్క్యులర్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.12 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
విజయ్ కుమార్ కుటుంబం కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. భర్తను కాపాడుకోవాలనే ఆశతో భార్య మారెమ్మ ఇప్పటికే బంధువులు, దాయాదుల వద్ద నుంచి సుమారు రూ.6 లక్షలు అప్పు తీసుకుని చికిత్స చేయించారని తెలిపారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించలేదని, ప్రస్తుతం మరింత వైద్యం చేయించేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ కుమార్‌కు భార్య మారెమ్మతో పాటు ఇద్దరు చిన్నారులు రాజు, శైలు ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం కావడంతో ఆయన అనారోగ్యం కారణంగా కుటుంబ జీవనం కూడా సంక్షోభంలో పడిందని స్థానికులు చెబుతున్నారు. రోజువారీ ఖర్చులు, వైద్య వ్యయాలు, అప్పుల భారం కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆదోని పర్యటనకు రానున్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మారెమ్మ కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రభుత్వంలోని ఇతర సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందించి తన భర్తకు వెంటనే శస్త్రచికిత్స జరిగేలా చూడాలని ఆమె కోరారు.
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి తమ కుటుంబానికి చేయూతనిస్తే విజయ్ కుమార్ ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 కామెంట్‌లు