హిందూపురం, జూలై 24 (మీకోసం న్యూస్):
ఒకే ద్విచక్ర వాహనంపై ఆరుగురు యువకులు ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో హిందూపురం రూరల్ పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ ఘటన హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, చిలమత్తూరు ఎస్సై శ్రీధర్ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు ప్రయాణిస్తుండటాన్ని గుర్తించారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకునేందుకు యత్నించగా వెంటాడి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ జనార్ధన్ మాట్లాడుతూ, ఒకే బైక్‌పై ఇంతమంది ప్రయాణించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. "ఒక్కసారి మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధ్యతను గుర్తుంచుకుని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి. ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు" అని యువతకు సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.
ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని చిలమత్తూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
– మీకోసం న్యూస్

0 కామెంట్‌లు